Thursday, February 17, 2011

శంఖం

శంఖే చంద్ర మావాహయామి

కుక్షే వరుణ మావాహయామి

మూలే పృధ్వీ మావాహయామి

ధారాయాం సర్వతీర్థ మావాహయామి

శంఖం సంపదలకు ప్రతీక ఈ పవిత్రమైన వస్తువులను పూజా గదుల యందు వుంచినట్లు అయితే అన్ని అరిష్ఠాలు మాయమైపోతాయి. సౌభాగ్యాల పంట దక్కుతుంది. ఇందువల్లనే భారతీయ సంస్కృతిలో దీనికి ప్రత్యేకమైన స్థానం కలదు. మందిరాలలోనూ శుభకార్యాలలోనూ దీని ధ్వని శోభను పెంచుతుంది. దీని పుట్టుక సముద్ర మధనంలో జరిగిందని చెబుతారు. సముద్ర మధనంలో వచ్చిన పదనాలుగు రత్నాలలో శంఖం ఒకటి విష్ణు పురాణం ప్రకారం లక్ష్మి సముద్రతనయ అయివున్నది.

శంఖం లక్ష్మికి సోదరి, సోదరుడు కూడాను. ఈమె లక్ష్మికి వారసురాలు, నవనిధులలో అష్టసిద్ధులలో దీనికి ఉపయోగిస్తారు. పూజ, ఆరాధన, అనుష్ఠాలలో, ఆరతిలో, యజ్ఞాలలో, తాంత్రికక్రియలలో దీనిని ఉపయోగిస్తారు. ఆయుర్వేదరీత్యా దీనిలో మంచి గుణాలు వున్నాయి. పురాతన కాలంలో ప్రతి ఇంటిలోనూ దీనిని స్థాపించి ఆరాధించేవారు. కూర్మ పీఠం మీద ఎరుపు పట్టు వస్త్రాన్ని వేసి దీనిని స్థాపించి, దేవతగా భావించి పూజించేవారు. ఈ పూజలు వల్ల వాళ్లకు ఎంతో అభివృద్ధికల్గేది. దీనికి అనేక రకాల పూజా విధానాలు కలవు. పూర్వం కొన్నింటిని గృహ కృత్యాలలో తప్పనిసరిగా వాడేవారు.

శంఖాలలో చాలా రకాలు వున్నాయి. రకాలను బట్టి పూజా విధానాలు కలువు. శంఖం సాధకుని మనోవాంఛలను పూర్తి చేయును. సుఖ సంతోషాలను కలగజేస్తుంది. ఈ శంఖాలు మానససరోవర్‌, లక్షద్వీప్‌, కోరమండల్‌, శ్రీలంక, భారతదేశంలోను లభిస్తున్నాయి. శంఖం యొక్క ఆకారాన్ని బట్టి వాటిని విభజిస్తారు ముఖ్యంగా 3 రకాలు 1. దక్షిణావృత శంఖం, 2. మధ్యావృత శంఖం, 3. ఉత్తరావృతవ శంఖం. ఎడమ చేతితో పట్టుకునే దానిని దక్షిణావృతమని కుడిచేతితో పట్టుకునే దానిని ఉత్తరావృత శంఖమని మధ్యలో నోరు వున్నదానిని మధ్యావృతమని అంటారు. ఈ శంఖాల పేర్లు ఈ విధంగా ఉన్నవి. 1. లక్ష్మీ శంఖం, 2. గోముఖ శంఖం, 3. కామధేను శంఖం, 4. దేవ శంఖం, 5. సుఘోష శంఖం, 6. గరుడ శంఖం, 7. మణిపుష్పక శంఖం, 8. రాక్షస శంఖం, 9. శని శంఖం, 10. రాహు శంఖం, 11. కేతు శంఖం, 12. కూర్మ శంఖం, భారత యుద్ధ సమయంలో అనేక రకాల శంఖాలు పూరించారు.

ఉదా:- శ్రీకృష్ణుడు పాంచజన్యం పూరించాడు, అర్జునుడు దేవదత్తాన్ని, భీముడు పౌంఢ్ర శంఖాన్ని యుధిష్ఠరుడు అనంత విజయ శంఖాన్ని, నకులుడు సుఘోష శంఖాన్ని, సహదేవుడు మణిపుష్పక శంఖాన్ని, కాశీరాజు శిఖండి శంఖాన్ని దుష్ఠ ద్యుమ్నుడు, విరాటుడు స్వాతిక శంఖాన్ని అలాగే ఇతర రాజులు అనేక రకాల శంఖాలు పూరించారు.

శంఖ ధ్వని విజయానికి, సమృద్ధికి, సుఖానికి, కీర్తి ప్రతిష్ఠలకు, లక్ష్మి ఆగమనానికి ప్రతీక, శంఖాన్ని శివపూజకు, పూజనందు ఆరతి ఇచ్చేటప్పుడు ధార్మిక ఉత్సవాలలో యజ్ఞాలలో రాజ్యాభిషేకాలకు, శుభ సందర్భాలలోనూ, పితృదేవతలకు తర్పణలు ఇచ్చేటప్పుడు మరియు దీపావళి, హోళి, మహాశివరాత్రి, విశిష్టమైన ఖర్మకాండలలో శంఖాన్ని స్థాపించి పూజిస్తారు. రుద్రపూజకు, గణశపూజకు, దేవిపూజకు, విష్ణుపూజకు దీనిని ఉపయోగిస్తారు. దీనిని గంగాజలం, పాలు, తేనె, నేయితోను, బెల్లంతోను, అభిషేకిస్తూ వుంటారు. దీనిని ధూపదీప నైవేద్యాలతో పూజిస్తారు. దీనిని పూజించటం వల్ల వాస్తుదోషాలుపోతాయి. వాస్తుదోషం పోవడానికి ఎర్ర ఆవుపాలతో దానిని నింపి ఇల్లు అంతా చల్లుతారు. ఇంటి సభ్యులు అంతా సేవిస్తారు. ఇలా చేయడం వల్ల అసాధ్య రోగాలు, దు:ఖాలు దౌర్భాగ్యం దూరమవుతాయి.

విష్ణు శంఖాన్ని దుకాణాలలోను ఆఫీసుల్లోను ఫ్యాక్టరీలలోను స్థాపించి అభివృద్ధిని పొందుతున్నారు. లక్ష్మి స్వయంగా శంఖం నాసహోదరి అని చెప్పిన సందర్భాలు కలవు. దేవి యొక్క పాదాలు వద్ద శంఖాన్ని వుంచుతారు. శంఖాలు వున్న చోట నుండి లక్ష్మి తరలిపోదు. ఆడ మగ శంఖాలని రెండు కలిపి స్తాపించాలి.

గణేష్ శంకాలలో నీరు నింపి గర్భవతులకు త్రాగించినట్లయితే గ్రుడ్డి, కుంటి, మూగ మొదలైన సంతానం కలగదు. అన్నపూర్ణ శంఖాన్ని ఆహారపదార్థాలలో స్థాపించి పూజిస్తారు. మణిపుష్పక్‌, పాంచ జన్యాలను కూడా అక్కడ స్థాపించి పూజిస్తారు. చిన్న శంఖ మాలలను ధరించి కూడా అనేక సిద్ధులను పొందుచున్నారు.

శాస్త్రవేత్తలు అభిప్రాయానుసారం శంఖ ధ్వని వల్ల వాతావరణ లోపాలు, కీటకముల నాశనం జరుగుతుందని -అనేక ప్రయోగాలు చేసి నిరూపించారు. శంఖ బస్మము వల్ల అనేక రోగాలు నయము అగుచున్నవి. ఋషి శృంగుడు చెప్పిన విధానం ప్రకారం చంటి పిల్లలకు శంఖమాలలు ధరింపచేసి వాటితో నింపిన నీరును త్రాగించినట్లయితే పిల్లలు ఆరోగ్యవంతులు అవుతారు. శంఖాన్ని పూరించుట వల్ల శ్వాశకోశ రోగాలు నశిస్తాయి. కొన్ని శంఖాలు చెవి దగ్గర పెట్టుకుంటే ఓంకార నాధం వినిపిస్తుంది. దానివల్ల భక్తుల కోర్కెలు తీరును. ఈ శంఖాలు వల్ల ఆయువృద్ధి, లక్ష్మీ ప్రాప్తి, పుత్రప్రాప్తి, శాంతి, వివాహ ప్రాప్తి కలుగుచున్నవి. శంఖము పాపనాశిని ప్రతి ఇంటిలోను శంఖము వుండవలసిన వస్తువు శంఖము వున్న ఇల్లు లక్ష్మీ నివాసము.

కొన్ని శంఖాల వివరణ:

దక్షిణావృత శంఖాలను పూజకు మాత్రమే ఉపయోగిస్తారు. ఉత్తరావృతాన్ని ఊదుటకు ఉపయోగిస్తారు. దక్షణావృతంలో శివశంఖం, పాంచజన్యం మొదలగు రకాలున్నవి. పాంచజన్యం పురుష శంఖం ఇది దొరుకుట కష్టం. శని శంఖాలకు నోరు పెద్దది పొట్ట చిన్నది. రాహు, కేతు శంఖాలు సర్పాకారంలో ఉంటాయి. రాక్షస శంఖానికి అన్నీ ముళ్లుంటాయి. ముత్యపు శంఖాలు పాలిష్‌ వల్ల వెండిలా మెరుస్తూ వుంటాయి. వినాయక శంఖం తొండాలతో కూడి ఉంటుంది. కూర్మ, వరాహ శంఖాలు తాబేలు, పంది ఆకారంలో ఉంటాయి. శంఖాలు ఎక్కువుగా రామేశ్వరం, కన్యాకుమారి, మద్రాసు, విశాఖపట్నం కలకత్తా, బొంబాయి మరియు పూరీలో ఎక్కువుగా దొరుకుచున్నవి.

సముద్రతనయాయ విద్మహే శంఖరాజాయ ధీమహీ తన్నో శంఖప్రచోదయాత్‌

Wednesday, February 16, 2011

భీష్మ ఏకాదశి

మన భరత భూమి పుణ్య భూమి. భక్తికి, భక్తి తత్వానికి పుట్టినిల్లు. అచంచలమైన భక్తి విశ్వాసాలతో భగవదారాధన చేసి, దైవానుగ్రహాన్ని పొందేందుకు, మన పూర్వులు నియమించిన కొన్ని పర్వ దినాలలో, ఏకాదశి వొకటి.

* ఏడాది పొడుగునా నెలకి రెండు పక్షాలు 1.సుక్లాపక్షము ,2. కృష్ణ పక్షము ... పక్షానికొక ఏకాదశి చొప్పున్న ..ఇరవైనాలుగు ఏకాదషులుంటాయి . ప్రతి నెలా ఆమవాసి కి , పౌర్ణమికి ముందు ఈ ఏకాదశులోస్తుంటాయి . ఆషాడశుక్ల ఏకాదశిని ప్రధమ ఏకాదశి గా పరిగనిస్తారు .

* ప్రతినెలలో పూర్ణిమకి ముందు వచ్చే ఏకాదశిని శుద్ధేకాదశి(శుద్ధ ఏకాదశి) అంటారు. సంవత్సరం మొత్తంలోఇటువంటిశుద్ధ ఏకాదశులు 12 వుంటాయి. వీటిలో ప్రతి ఏకాదశికి ప్రాముఖ్యత వున్నా, నాలుగు ఏకాదశులనువిశేషదాయకంగా పరిగణిస్తాము. అవి:


1.ఆషాడ శుద్ధ ఏకాదశి.(తొలేకాదశి/శయనేకాదశి)
2. కార్తీక శుద్ధ ఏకాదశి
3. పుష్య శుద్ధ ఏకాదశి (వైకుంఠ ఏకాదశి/ముక్కోటి ఏకాదశి)
4.మాఘ శుద్ధ ఏకాదశి (భీష్మ ఏకాదశి)

మాఘ శుక్ల ఏకాదశినే భీష్మ ఏకాదశి అంటాము. ఈ రోజునే విష్ణు సహస్ర నామం ఉద్భవించింది. విచిత్ర మైన ఘట్టం. ఒళ్ళంతా బాణాలు దిగి అంప శయ్య మీద ఉన్న ఆజన్మ బ్రహ్మ చారి. అష్ట వసువులలో ఒకడు. అతి పుణ్యాత్ముడు అయిన భీష్మ పితామహుడు. ప్రశ్నలు అడుగటానికి వచ్చింది ధర్మరాజు.ఎవరితో? అదే బాణాలు సంధించిన అర్జునుడు ఇతరులతో కలసి . తోడుకొని వచ్చింది "కృష్ణస్తు భగవాన్ స్వయం" అనబడే సాక్షాత్తూ భగవంతుని పూర్ణ అవతారం శ్రీ కృష్ణుడు.

భీష్ముడు ఇచ్చా మరణ వరం కలవాడు. అంటే అనుకున్నపుడే మరణించ గలడు. ఉత్తరాయణ పుణ్య కాలం కోసం ఎదురు చూస్తూ 50 రోజులు వంటిలో దిగిన బాణాలతో అంప శయ్య మీద వేచి వున్నాడు. చివరికి ఈ రోజు పవిత్ర మైన విష్ణు సహస్ర నామములను ఉపదేశించాడు ధర్మరాజుకు. భగవంతుడైన శ్రీ కృష్ణుడు చిరు నవ్వు తో విని ఆమోదించాడు. ఇట్టి మహత్తర ఘట్టం ఎక్కడా లేదు. భగవంతుని దివ్య నామములను స్వయానా భగవంతుడే విని దీవించిన అపూర్వ ఘట్టం.

శ్రుత్వా ధర్మా నషేశేన పావనాని చ సర్వశః యుధిష్టిర స్సాన్తనవం పునరేవాభ్య భాషత --భీష్ముడు చెప్పిన నానా ధర్మాలను విన్న ధర్మరాజు చివరగా. కొన్ని ప్రశ్నలు అడుగుతాడు.
కిమేకం దైవతం లోకే? కిం వాప్యేకం పారాయణం? స్తువంత కం కమర్చంత ప్రాప్నుయుర్మానవా శుభం? కో ధర్మ సర్వ ధర్మానాం భవత పరమో మతః. కిం జపన్ ముచ్యతే జంతు జన్మ సంసార బంధనాత్.?
లోకంలో ఎవరు దైవము? ఎవరిని పూజించి, స్తుతించి అర్చించాలి. దేనివల్ల మానవులకు శుభం కలుగుతుంది. అన్ని ధర్మములలోకి ఉత్తమ ధర్మమేది. దేనిని జపించుట వలన మనిషి సంసార బంధముల నుండి విముక్తి పొందుతాడు? అని.
దానికి భీష్మ పితామహుడు , జగత్ ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం అని చెబుతూ,
అనాది నిధనం విష్ణుం సర్వ లోక మహేశ్వరం
లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వ దుఖాతిగో భవేత్.
ఆది అంతము లేని, సర్వ వ్యాపి అయిన, దేవ దేవుడైన , భగవంతుడైన విష్ణు స్తుతి వల్ల సర్వ దుఃఖములు తోలగుతవి- అని ఇంకా చెబుతూ

ఎషమే సర్వ ధర్మానాం ధర్మోధిక తమో మతః- ఇదియే అన్ని ధర్మములలోకి ఉత్తమ ధర్మమని నా మాట అంటాడు.
నన్ను అనుగ్రహించిన సద్గురువులలో ఒకరైన, మహా తపస్వి, పరమ పూజ్య నందానంద స్వామి ఒక రోజు దీనిని నాకు వివరిస్తూ, సత్యా, పరమం యో మహత్తేజః పరమం యో మహత్తపః- ఏది పరమమైన తెజమో, ఏది పరమ మైన తపమో అట్టి దివ్యము తేజోమయము అయిన మంగళ స్వరూపాన్ని ధ్యానించు అన్నారు.

ముఖ్యం గా విష్ణు సహస్ర నామ జపం, ధ్యానం వల్ల భయం తొలగుతుంది, శుభం కలుగుతుంది. గణపతిని,వ్యాస భగవానుని,పితామహుని,పాండవులను, తల్లి తండ్రులను, గురువులను భక్తీ పూర్వకంగా స్మరించి తదుపరి , ఈ దివ్య నామములను జపిస్తూ తేజో మయుడైన, పరమాత్ముని ధ్యానించి బాధల నుంచి విముక్తుల మవుదాం.

ఈ విషయం Dr.Seshagirirao Vandana - MBBS(Srikakulam) గారు వ్రాసుకున్న Telugu pandugalu & Devullu : పండుగలు మరియు దేవుళ్ళు అనే బ్లాగ్ నుండి సేకరించడం జరిగినది



............ Sri Dr.Seshagirirao Vandana - MBBS గారికి సకలపూజలు.కాం తరుపున ధన్యవాదములు